Damagundam | హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దామగుండం అటవీప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై నెలల తరబడిగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఈ అటవీ ప్రాంతంలో కేంద్రం ఏర్పాటు శంకుస్థాపనకు ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 15న జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు గురువారం ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఆహ్వానాలను అందజేశారు.
దీంతో పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాల నేతలు, స్థానికులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఆందోళనలను పట్టించుకోకుండానే ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు వెళ్తుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరించడంపై వికారాబాద్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే 400 ఏండ్ల చరిత్ర గల దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయం కనుమరుగవుతుందని చెప్తున్నారు.
లక్షల సంఖ్యలో విలువైన ఔషధ మొక్కలు అంతరించిపోతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాంతంలోని గిరిజన ప్రజలు నిరాశ్రయులు కావడంతోపాటు, ఇతర జంతువులకూ ముప్పు వాటిల్లుతుందని భయపడుతున్నారు. భావితరాలకూ అన్యాయం జరుగుతుందని, రాడార్ రేడియేషన్‌తో శారీరక, మానసిక రుగ్మతలతో తీవ్ర అనారోగ్యాల పాలవుతారని పర్యావరణవేత్తలు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2027 నాటికి ఈ స్టేషన్ నిర్మా ణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముం దుకు వెళ్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 15న ఎలాంటి వ్యతిరేకత వస్తుందనే ఆందోళన పోలీసు, అటవీశాఖ అధికారుల్లో నెలకొన్నది.