జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి రోప్ వైర్లు తెగిపోయిన సంఘటన మరువక ముందే.. మంజీరా ప్రాజెక్టు ఆఫ్రాన్ దెబ్బతిన్న సంఘటన వెలుగుచూసింది. మొన్నటికి మొన్న పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. వీటన్నింటికీ కారణం సర్కారు నిర్లక్ష్యమేనని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు సంబంధించిన మరమ్మతు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ప్రభు త్వం నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. ఫలితంగా ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
Irrigation Projects | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): భారీ ప్రాజెక్టుల్లో సత్వరమే చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనులు ఉంటాయి. వాటిపై కూడా ప్రభుత్వం దృష్టిసారించడం లేదని అధికారులు వాపోతున్నారు. ఓఅండ్ఎం పనులను సాధారణంగా చిన్న గుత్తేదారులు నిర్వహిస్తుంటారు. వారికి ఆర్థిక వనరుల పరిమితి తక్కువే. కాంపోనెంట్ల వారీగా మరమ్మతులు పూర్తిచేసిన కొద్దీ, అందుకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తేనే తదుపరి పనులను చేపడుతుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో ఓఅండ్ఎం పనులు మందకొడిగా సాగుతున్నాయని ఇంజినీర్లు, గుత్తేదార్లు పేర్కొంటున్నారు. ఓఅండ్ఎం పనులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 337.80కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అందులో రూ.74కోట్లను మాత్రమే విడుదల చేసింది. మరో 24కోట్లకు బీఆర్వో విడుదల చేసినా నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓఅండ్ఎం కింద రూ.205.66కోట్ల విలువైన పనులను మంజూరు చేయగా, రూ.17.70కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి.
మిగతా వాటికి ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నిధుల లేమీ కారణంగా ఆయా పనులను చేపట్టేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. ప్రాజెక్టుల మరమ్మతు, మెయింటనెన్స్ పనుల్లో ఎక్కడా జాప్యం నెలకొనవద్దనే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఅండ్ఎం విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈఈలు మొదలు చీఫ్ ఇంజినీర్ల స్థాయి వరకు పనులను చేపట్టేందుకు ఆర్థిక అధికారాలను సైతం కట్టబెట్టింది. రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు చీఫ్ ఇంజినీర్ల స్థాయిలోనే ఓఅండ్ఎం కమిటీ సమావేశాన్ని నిర్వహించుకుని పనులను ఆమోదించుకుని, చేపట్టుకునే వెసులుబాటును కల్పించారు.
ప్రస్తుతం 19టెరిటోరియల్ సర్కిళ్లలో చాలా మంది సీఈలు ఆ కమిటీ సమావేశాలనే నిర్వహించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రూ.10లక్షలకు సంబంధించిన పనులను సైతం ఓఅండ్ఎం రాష్ట్ర కమిటీ ఆమోదానికే పంపిస్తున్నారు. ఇక నిధులను విడుదల చేయకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఆమోదించిన పనులను సైతం చేపట్టేందుకు అధికారులు జంకుతున్నారు. మరోవైపు సాగుతున్న పనులపై క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు ఉన్నాయి.
జూరాల ప్రాజెక్టుకు సంబంధించి రోప్ వైర్లతోపాటు, గ్యాంట్రీ మరమ్మతులు, గేట్ల నుంచి నీటి లీకేజీలు ఏర్పడుతున్నాయి. అందుకు సంబంధించి ఓఅండ్ఎం పనులకు మొత్తంగా రూ.8కోట్ల మేర నిధులు అవసరమవుతాయని గతంలో అంచనా వేశారు. పనులకు ఆమోదం తెలిపి, టెండర్ నిర్వహించి కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కానీ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఇటీవలే రూ.కోటి విడుదల చేయగా, కాంట్రాక్టర్ చాలాకాలం సాగదీసి, చివరికి పనులు చేపట్టారు. కానీ అప్పటికే వర్షాకాలం సీజన్ సమీపించింది. ప్రస్తుతం భారీగా వరద రావడంతో గేట్లకు సంబంధించి రోప్ వైర్లు తెగిపోయాయి. గతేడాది కురిసన వర్షాలతో అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిన విషయం తెలిసిందే. దాదాపు రూ.30కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులను నిర్వహించేందుకు దాదాపు రూ.3.5కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. ఆ పనులనే ఇప్పటికీ పూర్తిస్థాయిలో చేయలేదు.
ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన శాశ్వత మరమ్మతుల ఊసే సర్కారు ఎత్తడం లేదు. మంజీరా ప్రాజెక్టును స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు సంబంధించి ఎక్స్పర్ట్ ప్యానల్ ఈ ఏడాది మార్చి 22న సందర్శించింది. డ్యామ్ భద్రత, నిర్వహణ లోపాలను పరిశీలించింది. హైదరాబాద్ జంట నగరాలతోపాటు చుట్టూ ఉన్న గ్రామాలకు మంచినీరు అందించే మంజీరా ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, వెంటనే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది.
బరాజ్ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, తుమ్మ చెట్లు పెరగడంతో మట్టికట్ట బలహీనపడిందని, ఆప్రాన్ కొట్టుకుపోయిందని, భారీ గుంతలు ఏర్పడ్డాయని సర్కారుకు నివేదించింది. గేట్ల సీలింగ్ సరిగా లేదని, నీటి లీకేజీలు కనిపిస్తున్నాయని, బరాజ్ పునరుద్ధరణకు సత్వరం కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్ఎస్ )తో అధ్యయనం చేయించి, చర్యలు చేపట్టాలని ఎక్స్పర్ట్ ప్యానెల్ నివేదించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇవే కాదు రాష్ట్రంలో మరికొన్ని ప్రాజెక్టులపై కూడా రిపోర్టు సమర్పించినా సర్కారులో మాత్రం చలనం లేకుండా పోయింది.
గతేడాది కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. ప్రాజెక్టులు స్లూయిస్‌లు, గేట్లు దెబ్బతిన్నాయి. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులను నిర్వహించాల్సి ఉంది. ఆయా ప్రాజెక్టుల మరమ్మతులకు సంబంధించి దాదాపు రూ.200కోట్లతో అంచనాలను రూపొందించారు. కానీ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో సకాలంలో మరమ్మతు పనులను ప్రారంభించలేదు. ఎండాకాలంలో మరమ్మతులు చేయకపోతే చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల తూములు, గేట్లు వంటివి ఎత్తి నీటిని విడుదల చేయడం కష్టం. అందుకే వేసవినే అనువైన కాలంగా చెప్తారు. కానీ ప్రభుత్వం వేసవి కాలంలో నిధులను విడుదల చేయలేదు. దీంతో మరమ్మతులన్నీ ఆగిపోయాయి.