నల్లగొండ ప్రతినిధి, ఆగస్ట్టు 18 (నమస్తే తెలంగాణ): దళితోద్ధారకుడు కేసీఆర్.. దళిత బాంధవుడు సీఎం కేసీఆర్.. అనే నినాదాలు మిన్నంటాయి. దళితుల ఆర్థిక సుస్థిరత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంబురాలు అంబురాన్ని తాకాయి. సీఎం కేసీఆర్ కృతజ్ఞత కార్యక్రమాలు కొనసాగాయి. మంగళవారం జిల్లా అంతటా దళిత ఉద్యోగులు పెద్దఎత్తున సంబురాలు జరుపగా.. బుధవారం మహిళలు వినూత్నరీతిలో కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో మహిళల ఆధ్వర్యంలో దళితబంధు వేడుకలు ఘనంగా జరిగాయి.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. సీఎం కేసీఆర్ నిలువెత్తు చిత్రపటాన్ని తయారుచేయించగా.. 300 మందికిపైగా మహిళలు హాజరై కేసీఆర్ చిత్రానికి పుష్పాభిషేకం చేశారు. అదే సమయంలో ఎమ్మె ల్యే చిరుమర్తితోపాటు మరికొందరు మహిళలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఓ వైపు గులాబీ పూల వాన.. మరోవైపు క్షీరాభిషేకం.. ఇంకోవైపు నినాదాలు మిన్నంటాయి. మహిళలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితుల ఉద్ధరణకు పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
వేలేరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
దళితవర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, అణగారినవర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. దళితులకు దళితబంధు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తంచేస్తూ బుధవారం హనుమకొండ జిల్లా వేలేరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 17 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అమలుచేస్తామని సీఎం చెప్పడంపై ఆయన చిత్రపటానికి 17 బిందెల పాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడా సరితారెడ్డి, వైస్ ఎంపీపీ అంగోతు సంపత్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుజ్జుల రాంగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.