ఖైరతాబాద్, డిసెంబర్ 9 : బడాబాబుల నిర్మాణాల కోసం తమ ఇండ్లను అన్యాయంగా కూల్చేశారని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని శ్రీస్వామివివేకానందనగర్ బస్తీకి చెందిన దళితులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే తమకు పునరావాసం కల్పించి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఆ బస్తీకి చెందిన ఎంబీ కృష్ణ, జ్ఞానేందర్, డీ ఆనంద్‌రావు, ఎం వసంత్ కుమార్, ఎం సువర్ణ, పద్మావతి సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ గోడు ను వెళ్లబోసుకున్నారు. 1957లో ఏర్పడిన తమ బస్తీలో పేద దళితులే అధికంగా ఉంటున్నారని, 1974లో ప్రభుత్వం తమ బస్తీకి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి కల్పించిందని తెలిపారు. తమ బస్తీ గుండా రోడ్డును నిర్మించాలని పక్కనే ఉన్న జనప్రియ అపార్ట్‌మెంట్‌వాసులు పట్టుబట్టడంతో ఆ అంశంపై నిర్ణయం తీసుకోవాలని 2006లో కోర్టు అప్పటి కలెక్టర్‌ను ఆదేశించిందని, దీంతో బస్తీ వాసులకు పునరావాసం కల్పించిన తర్వాతే రోడ్డు వేస్తామని కోర్టుకు కలెక్టర్ నివేదించారని వివరించారు. ఇటీవల శతాబ్ది పేరుతో మరో భవనాన్ని నిర్మించడంతో అందులోని వారు కూడా రోడ్డు కావాలని హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే ఈ ఏడాది జనవరి 29న అధికారులు వచ్చి రోడ్డు విస్తరణ పేరుతో 19 ఇండ్లను కూల్చివేశారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే పునరావాసం కల్పించాలని కోరారు.