ఇనుగుర్తి, ఆగస్టు9 : మహబూబాబాద్(Mahabubabad) జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని తమ శ్మశానవాటిక స్థలం కబ్జా చేశారని (Cremation occupied)దళితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా(Dalits dharna )చేశారు. అనంతరం డిప్యూటి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ ఎస్సీ కులస్తులకు సర్వే నంబర్ 512లో 27గుంటల భూమిని కమలాకర్ అనే వ్యక్తి విరాళంగా ఇచ్చాడని, సర్వే నంబర్ 483లోని 32గుంటల భూమి తమ తాతల కాలం నుంచి శ్మశానవాటికకు ఉపయోగించుకుంటున్నామని అన్నారు.
ఈ 59 గుంటల భూమిని మాజీ సర్పంచ్, ఆయన మనుమడు అక్రమంగా ఆక్రమించుకొని పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఇదేమని వారిని అడుగగా 11 మంది దళితులకు కోర్టు నోటీసులు పంపించారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వారి పట్టాను రద్దు చేసి, అక్రమంగా భూమిని వారికి పట్టాచేసిన అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై డీటీ ఆకుల రవిని వివరణ కోరగా దళితులకు చెందిన 57 గుంటల భూమి కబ్జాకు గురైందని కాలనీవాసులు తమకు వినతిపత్రం అందజేశారని తెలిపారు. 512,483 సర్వే నంబర్ల భూమిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.