రాష్ట్రంలో జోరుగా దళితబంధు అమలు
యూనిట్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు
దళితుల ఆర్థిక ప్రగతే దళితబంధు లక్ష్యం
సద్వినియోగం చేసుకొని గొప్పగా ఎదగాలి
బీజేపీ నాయకులకూ పథకం ఇస్తున్నాం
యూనిట్ల పంపిణీ సందర్భంగా మంత్రులు
కడుపు నింపేవాడు కనిపించే దేవుడు !
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న దళితులు.. నేడు యజమానులుగా మారారు. ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు అందుకొన్న దళితులు సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచుకొన్నారు. నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుడు సుమన్ తనకు కేటాయించిన ట్రాక్టర్‌కు దండం పెట్టి సంబుర పడ్డాడు. శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు పేర్కొన్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్: దశాబ్దాలుగా అణగారిన సమాజంలో వెలుగు పూవులు పూస్తున్నాయి. దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా పోగొట్టేందుకు ముఖ్యమంత్రి ప్రారంభించిన దళితబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా అమలవుతున్నది. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభమైన ఈ పథకం రాష్ట్రం నలుదిక్కుల్లో దళితజ్యోతులు వెలిగించింది. దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఎంపిక చేసుకున్న యూనిట్లను అందజేశారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం లాంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో చూపుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మండల పరిధిలోని కొల్గూరు గ్రామానికి చెందిన 129 మందికి రూ.10.26 కోట్ల విలువైన దళితబంధు యూనిట్లను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు.. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.
జగదేవ్‌పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాల రైతులకు భూమి హక్కు పత్రాలను గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో అందజేశారు. దళితబంధు యూనిట్ల పంపిణీ సందర్భంగా కొల్గూరు గ్రామ దళితులంతా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహబూబ్‌నగర్‌లో లబ్ధిదారులకు 17 ట్రాక్టర్లు, 2 బొలెరో, గూడ్స్ వాహనాలను పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 223 మంది లబ్ధిదారులకు వివిధ రకాల యూనిట్లను అందజేశారు. కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో విప్ గంప గోవర్ధన్ దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీచేశారు.
జిల్లాలో 33 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, డీసీఎంలు, ఆటోలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఐదుగురు లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలకు సంబంధించిన చెక్కును టీఆర్ఎస్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి మండలాలు, కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీచేశారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 270 మంది లబ్ధిదారులకు రూ.20.72 కోట్ల విలువైన వాహనాలను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. హనుమకొండలోని గిరిజన సంక్షేమ భవన్లో రూ.3.82 కోట్ల విలువైన యూనిట్లను చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి 42 మంది లబ్ధిదారులకు పంపిణీచేశారు.
సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు వంద చొప్పున, తుంగతుర్తి నియోజకవర్గంలో 45 మందికి.. మొత్తం 345 మందికి రూ.35 కోట్ల విలువైన యూనిట్లు, ప్రొసీడింగ్స్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిశోర్, మల్లయ్యయాదవ్, సైదిరెడ్డి అందజేశారు. భువనగిరిలో విప్ గొంగిడి సునీత ఆత్మకూర్(ఎం) మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన ఇద్దరికి డోజర్లు, ఇద్దరికి ట్రాక్టర్లు, మరో ఇద్దరికి కలిపి ఒక డీసీఎం, వాసాలమర్రి గ్రామానికి చెందిన ఒకరికి ట్రాక్టర్‌ను పంపిణీ చేశారు. మరో 49 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం వట్పల్లిలో బుడ్డాయిపల్లికి చెందిన 44 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందజేశారు.
2 వేల మందితో భారీ ర్యాలీ
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా సూర్యాపేటలో 2 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి జగ్జీవన్‌రాం విగ్రహం వద్దకు డప్పు చప్పుళ్లు, కోలాట బృందాల నృత్యాల మధ్య దళితులతో కలిసి మంత్రి తరలివచ్చారు. అనంతరం జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
దళితులను దారిద్య్రం నుంచి దూరం చేసేందుకే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో దళితులంతా ధనవంతులుగానే జీవిస్తారు. దేశంలో బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా దళితబంధు లాంటి పథకం అమలు చేస్తున్నారా? కొల్గూరులోని బీజేపీ నాయకులకు కూడా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. – ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు
దళితబంధు పథకం కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నదా? దళితులను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నారే తప్ప ఏనాడైన వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజమైన రైతుబంధు, దళితబంధు సీఎం కేసీఆరే. ఈ పథకం కింద రెండో విడుత లబ్ధిదారులను ఈ నెలలోనే ఎంపికచేస్తాం. – కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
దళిత కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో దేశంలో చాలా ప్రభుత్వాలు వచ్చి పోయినప్పటికీ దళిత జాతి మేలు కోసం ఎవరూ ఈ విధంగా ఆలోచించలేదు. రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో ఈ పథకాన్ని తీసుకు రాలేదు.
– ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఆర్థిక పురోగతితోనే దళితులు అభివృద్ధి సాధిస్తారని, దళితుల బతుకుల్లో వెలుగులు నింపి, వారి కండ్లలో ఆనందం నింపడం కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. దళిత జాతి పైకి రావాలని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని ఆనాడు అంబేద్కర్, జగ్జీవన్‌రాం కలలుగన్నారు. ఆ కలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు.
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
పేద, మధ్య తరగతి ప్రజల పట్ల సీఎం కేసీఆర్ అత్యంత మానవీయతతో ఉంటారు. అలాంటి వారి ముఖాల్లో సంతోషాలు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా. దళితబంధును ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు సైతం అందజేస్తున్నాం. విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు, కాంట్రాక్టుల్లో సైతం దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. – విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి. వ్యాపారం చేసుకొంటే ఎంత డబ్బు అవసరమో ఆలోచించి దళితులకు ఈ భరోసా కల్పిస్తున్నాం. రూ.10 లక్షలతో కాకుండా రూ.5 లక్షలతో యూనిట్ పెట్టుకొన్నా మిగిలిన రూ.5 లక్షలతో మరో యూనిట్ ఏర్పాటుచేసుకొనే అవకాశం ఉన్నది.
– పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి లబ్ధిదారుడిపై ఉన్నది. ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగి ఉన్నతులుగా జీవించాలి.
– స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి