కవాడిగూడ, జూన్ 4: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలోనే ఎంతో గొప్ప పథకమని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం అనిల్‌కుమార్‌యాదవ్ ప్రశంసించారు. తాము ఈ పథకాన్ని స్వాగతిస్తున్నామన్నారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ ఘంటసాల మైదానంలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా దళిత బంధు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కలెక్టర్ శర్మన్‌కు అనిల్‌కుమార్, తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. దళితబంధు పథకం దళితులకు ఎంతో ఉపయోగకరమని, పేద దళితులకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన ఈ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపిందని, దీంతో దళితుల తలరాతలు మారుతున్నాయని ప్రశంసించారు.
పార్టీలకతీతంగా దళితబంధు: మంత్రి సత్యవతిరాథోడ్
ములుగు: రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు పథకం వర్తించేలా పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం ఆమె ములుగు డిగ్రీ కళాశాల మైదానంలో దళితబంధు పథకం కింద ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాలు, భద్రాచలం నియోజకవర్గంలోని రెండు మండలాలకు చెందిన 97 మంది లబ్ధిదారులకు ట్రాన్స్‌పోర్టు వాహనాలు పంపిణీ చేశారు.
దళితబంధు భేష్: ఎమ్మెల్యే సీతక్క
దళితబంధు పథకం అమలుకు అన్ని నియోజకవర్గాల్లో ఒకే విధానాన్ని పాటించడం అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క కొనియాడారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించేందుకు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరైన నిబంధనలను రూపొందించి అమలు చేయాలని కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాట్లాడుతూ.. కబడిన వర్గాలకు మేలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఎంతో గొప్పదన్నారు.