కరీంనగర్ : జిల్లాలోని హూజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోమంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు. దళిత బంధుకు సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నారు. ఎల్లుండి(సోమవారం) హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభిస్తారు. అర్హులైన 15 మందికి సీఎం స్వయంగా చెక్కులు అందజేయనున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు అందుతుంది. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదు. కాంగ్రెస్, బీజేపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు. రైతుబంధు విషయంలో కూడా ఇటువంటి అపోహలే సృష్టించారు.
ఎన్నికల కోసమే దళిత బంధు అని అంటున్నరు. దళిత ఎంపవర్మెంట్ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నేనే చెప్పాను. తన నియోజకవర్గ ప్రజలకు మంచి జరుగుతుంటే ఆహ్వానించాలి. కానీ దురదృష్టం ఏంటంటే దళితబంధును వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నడు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు రూ.10 లక్షలు అందిస్తున్నాం. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్ ఇప్పించాలి. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందజేస్తే పాలాభిషేకం చేస్తాం. ప్రభుత్వ చర్యను ఆహ్వానించాల్సిందిపోయి కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరే మాడి మసైపోతారని హరీశ్ రావు అన్నారు.