Kamareddy | లింగంపేట, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి రోజునే పోలీసులు దళితుల పట్ల కర్కశంగా వ్యవహరించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు నీరడి సంగమేశ్వర్ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. ఫ్లెక్సీని తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ రవీందర్ నాయక్ వచ్చి పంచాయతీ సిబ్బందిని పురమాయించి ఫ్లెక్సీని తీసేయించారు.
ఇదేమిటని దళిత సంఘాల నాయకులు ప్రశ్నించగా, సీఐ వారితో దురుసుగా ప్రవర్తించారు. ఆయన తీరును నిరసిస్తూ నాయకులు రహదారిపై బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పక్కకు లాగిపడేశారు. ఈ క్రమంలో దళిత మాజీ ఎంపీపీ సాయిలు ప్యాంటు ఊడిపోయినా పట్టించుకోకుండా కాళ్లుచేతులు పట్టుకుని లాక్కెళ్లారు. ఘటన సంగతి తెలిసి అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల ఆందోళనకు దిగారు.