కరీంనగర్/హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రమంతా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. హుజూరాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్‌లో గ్రౌండింగ్ పూర్తి కావస్తున్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి, మార్చి 7 నాటికి 100 శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. శనివారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మంత్రి హాజరు కాగా, బీఆర్కేభవన్ నుంచి సీఎస్‌తోపాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళిత జనోద్ధరణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ పథకం విజయవంతానికి కంకణబద్ధులు కావాలని సూచించారు. ఇప్పటికే వందశాతం నిధులు కేటాయించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రౌండింగ్ పూర్తి కావస్తున్నదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో స్ఫూర్తివంతమైన దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. వీటితోపాటు ఖమ్మం జిల్లా చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పురోగతిని వివరించారు. 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం కోసం దాదాపు రూ.1,200 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.100 కోట్లు విడుదలచేసినట్టు తెలిపారు.
నియోజకవర్గాల్లో దళితబంధు లబ్ధిదారులను స్థానిక ఎమ్మెల్యేల సలహాతో ఎంపికచేసి ఆ జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జి మంత్రులతో ఆమోదింపచేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు కోరుకొన్న యూనిట్లనే ఎంపికచేయాలని, లాభసాటి యూనిట్లు ఎంపిక చేసుకొనేలా అవగాహన కల్పించాలని పథకం మార్గదర్శకాల గురించి వివరించారు. ఒకొక లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షల్లోంచి దళితబంధు రక్షణనిధికి రూ.10 వేలు జమ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
దళితబంధు సమితులు ఏర్పాటుచేస్తాం: సబిత
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పథకం అమలు ప్రణాళికపై శనివారం సాయంత్రం మంత్రి నివాసం నుండి రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్, అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో దళితబంధు సమితులను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి వారంలోగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని, ఫిబ్రవరి నెలఖారులోపు లబ్ధిదారుల ఖాతా నంబర్లు, ఇతర అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మార్చి మొదటివారం వరకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, మూసీ రివల్ ఫ్రంట్ బోర్డు చైర్మన్ సుధీర్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం: ప్రశాంత్‌రెడ్డి
దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపికచేసి యూనిట్లు అందిస్తామని చెప్పారు. నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరుగుతుందని, వారే క్రియాశీలకంగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్లో వేర్వేరుగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని సమర్థంగా అమలుచేసి జిల్లాను ఆదర్శవంతంగా నిలపాలని అధికారులకు సూచించారు. పథకంలో భాగంగా లబ్ధిదారుల కోసం యూనిట్లపై వారంలోగా సమగ్ర ప్రణాళిక సిద్ధంచేయాలని తెలిపారు. యూనిట్ విలువ రూ.10 లక్షలు ఉండాలనే నిబంధన లేదని, అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన యూనిట్లను గుర్తిస్తే లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటుచేసి వారికి పథకాన్ని వర్తింపజేయాలని వివరించారు. జ్వర సర్వేపై మాట్లాడిన మంత్రి.. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఆర్థిక ఏడాదిలో విడుదలైన దళితబంధు నిధులు
మొత్తం రూ. 3,449.40 కోట్లు