Balagam Mogilaiah | దుగ్గొండి : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఈ పథకంతో ఆర్థికంగా నిలదొక్కోవడమే కాదు.. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి దళిత కుటుంబాలు ఎదిగాయి. బతుకుదెరువు భారంగా బలగం మొగిలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. మొగిలయ్యకు దళితబంధు పథకాన్ని మంజూరు చేసి.. ఆ కుటుంబంలో వెలుగులు నింపింది కేసీఆర్ సర్కార్.
ఈ మేరకు నర్సంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దళితబంధు పథకంలో భాగంగా ఒక యూనిట్‌ను మొగిలయ్య కుటుంబానికి మంజూరు చేశారు. ఈ సందర్భంగా మొగిలయ్య దంపతులను పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు శాలువాతో సన్మానించారు. ఆర్థికంగా చతికిలపడ్డ తమ కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్ సర్కార్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని, కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని మొగిలయ్య దంపతులు తెలిపారు.
మొగిలయ్య కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది ఆయన యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పేరు ప్రఖ్యాతులను బలగం సినిమా ద్వారా దేశవ్యాప్తం చేసిన మొగిలయ్య దంపతుల ప్రతిభ ఎంతో గొప్పదని ఎమ్మెల్యే అన్నారు. మొగిలయ్య ఆరోగ్యం బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మొగిలయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ స్వప్న దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.