జమ్మికుంట/హుజూరాబాద్ టౌన్, జూన్ 23: దళితులు ధనవంతులుగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు.
గురువారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి వినోద్‌కుమార్ జమ్మికుంట, హుజూరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వీణవంక ప్రధాన రోడ్డులో దళితబంధు లబ్ధిదారుడికి మంజూరైన శ్రీ సాయి ట్రేడర్స్ (ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబింగ్)ను, జమ్మికుంట రోడ్డులో రాకేశ్ అనే యువకుడు ఏర్పాటు చేసుకొన్న పీకేఆర్ కార్ డెకర్స్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి యూనిట్లు మంజూరవుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులు ఆయా వ్యాపారాల్లో స్థిరపడాలని సూచించారు.