హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి వారి జీవితాలను బాగు చేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని, ఏది మార్పో ప్రజలు, దళిత సంఘాలు ఆలోచించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు. సోమవారం తెలంగాణ భవన్లో హుజూరాబాద్ దళితబంధు బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ పద్ధతిన ఈ ప్రాజెక్టును నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి 18,500 మంది దళితులకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో వేశారని గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తే, రేవంత్‌రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దళితబంధు అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఏడాది పాలన పూర్తవుతున్నా దళితబంధు లబ్ధిదారులకు డబ్బు చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు అనే గొప్ప పథకంతో వరర్లు యాజమానులుగా మారారని, దళితబంధును ఆపిన దద్దమ్మ రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో దళితబంధు సాయాన్ని రూ.12 లక్షలకు పెంచుతామన్నారని, అది ఇవ్వకపోగా, ఇచ్చే రూ. 10 లక్షలను కూడా ఆపుతున్నారని మండిపడ్డారు.
నవంబర్ 8న దళితబంధు లబ్ధిదారుల పక్షాన ధర్నా చేస్తే కేసులు పెట్టడంపై కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకే ధర్నాపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, పేదలు, దళిత మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఏసీపీ అత్యం త దారుణంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను బూటు కాళ్లతో తన్నారని మండిపడ్డారు.‘ఇన్ని రోజులు ఓపిక పట్టా. ఇకపై సహించను. దళితులను పోలీస్ స్టేషన్‌కు అనవసరంగా పిలిపిస్తే ఊరుకునేది లేదు. పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు.
హుజూరాబాద్‌లో దళిత బిడ్డలపై జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు, దళిత సంఘాలు స్పందించాలని పిలుపునిచ్చారు. తన ప్రాణం పోయినా సరే దళితబంధు వచ్చేదాకా పోరాడతానని తెలిపారు. హుజూరాబాద్‌లోని దళితులపై జరిగే అకృత్యాలపై రాష్ట్ర, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.