కరీంనగర్ కార్పొరేషన్, జూలై 9: దళితులు ఆర్థికంగా బలోపేతమై జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కార్ఖానాగడ్డ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్లో రూ.52 లక్షల వ్యయంతో చేపట్టిన కమ్యూనిటీ హాల్‌తోపాటు, నూతన భవన నిర్మాణాన్ని మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం దళితబంధు కింద మంజూరైన యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు ఓట్ల కోసమే దళితులను వాడుకొన్నారని దుయ్యబట్టారు. దళితులను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసేందు కు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని చెప్పారు. మధ్యవర్తులకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం, వారు ఎంచుకొన్న యూనిట్లను అందించి ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేస్తున్నదని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాలతోపాటు కుల సంఘాల భవనాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు.