వీణవంక/ జమ్మికుంట/ హుజూరాబాద్‌టౌన్, మే 24 : దళితబంధు సాధన కమిటీ పిలుపు మేరకు రెండో విడత నిధులు ఇవ్వాలని హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న దళితబంధు సాధన కమిటీ సభ్యులను శనివారం వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్‌లో పోలీసులు నిర్బంధించారు. హుజూరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నారనే సమాచారంతో చెల్పూర్‌కు చెందిన ఆకినపల్లి ఆకాశ్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
వీణవంక, జమ్మికుంటలో అరెస్ట్ అయిన వారిలో దళితబంధు సాధన కమిటీ ఇన్చార్జిలు కొలుగూరి నరేశ్, మంద రాజేశ్, బండారి ప్రశాంత్, మహంకాళి రమేశ్, సాగంటి స్వామి, ఊట్ల సంపత్, పుల్లూరి సంపత్, దాసారపు నాగరాజు ఉన్నారు. దళితబంధు రెండో విడత నిధులు వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. దళితబంధు సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. నిధుల మంజూరులో రూ.5 లక్షలు పెండింగ్‌లో ఉన్నవారికి మొదట విడుదల చేయాలని కోరారు. రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు పెండింగ్‌లో ఉన్న వాళ్లకు మొదటగా మంజూరు చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దళితబంధు పథకం కింద వచ్చిన డబ్బులతో కంగన్‌హాల్ వ్యాపారం పెట్టుకున్నా. మొదటి విడత నిధులతో అరకొర సామాన్లే వచ్చినయ్. రెండో విడత నిధులు అందుతాయ నే ఆశతో అదనంగా అప్పులు తెచ్చి వ్యాపారం సాగిస్తున్నా. పథకం అర్ధాంతరంగా ఆగిపోవడంతో అప్పులు కట్టేందుకు గోసపడ్తున్నం. ప్రభు త్వం స్పందించకుంటే పార్టీ నాయకుల ఇండ్ల ముందు వంటావార్పు, ముట్టడి కార్యక్రమాలు చేస్తాం.
– కే కోమల, ఇల్లందకుంట