కరీంనగర్ : దళితులను సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగెలా చేసిన దళిత బంధు(Dalit Bandhu) పథకం భవిష్యత్తు తరాలలో వెలుగులు నింపనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula ) అన్నారు. దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొంది ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన లబ్దిదారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం డాక్టర్ బీఆర్. అంబేద్కర్(Ambedkar) కన్న కళలను సాకారం, దళితుల జీవితాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్(CM KCR) దళిత బంధులను ప్రవేశపెట్టారని అన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఎటువంటి పూచికత్తు , ఆస్తి పత్రాలుగాని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా దళితబంధు పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారని వెల్లడించారు. నిన్నటి వరకు క్లీనర్లు, డ్రైవర్లుగా, కూలీలుగా ఉన్న వారు నేడు దళిత బంధు ద్వారా ఇప్పుడు యజమానులుగా ఎదిగారన్నారు.
మనజీవన ప్రమాణాలను నిర్దేశిస్తూ రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ను భారతదేశ ఆస్తిగా పరిగణించాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్, మహత్మాజోతిబా పూలే లు జన్మించిన ఎప్రిల్ మాసాన్ని పవిత్రమాసంగా పరిగణించాలని అన్నారు. హైదరాబాద్ మహనగరంలో చారిత్రాత్మక కట్టడం 125 అడుగుల భారీ బీఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించామని, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరునే పెట్టామని వెల్లడించారు.
విగ్రహావిష్కరణకు ప్రజలు తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై. సునీల్ రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్ కమార్, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.