హైదరాబాద్ : దళితబంధు పథకాన్ని ప్రకటించిన దళిత బాంధవుడు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ దళితుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ పేర్కొన్నారు. శాసనసభలో దళిత బంధు పథకంపై స్వల్పకాలిక చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్యాదరి కిశోర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు జైభీమ్లు తెలిపారు. దళిత బంధును ఒక పథకంగా చూడొద్దు. ఇది ఒక విప్లవం. ఇది ఒక దళిత జనోద్ధారణ ఉద్యమం. దళితుల కోసం 70 సంవత్సరాల్లో గొప్పగొప్ప నినాదాలు తీసుకున్నారే తప్ప.. అమలు కాలేదు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలను ఆలోచనల్లోకి నెట్టేస్తున్నాయి. దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా మారబోతుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. తెలంగాణ ప్రాంతంతో అంబేద్కర్‌కు అవినాభావ సంబంధం ఉంది. ఆర్టికల్ 3ను ఉపయోగించుకుని తెలంగాణను సాధించుకున్నాం. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 125 గురుకుల పాఠశాలలను నెలకొల్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1600 గురుకులాలు ఉన్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు అని ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తెలిపారు.