పెద్దవంగర, నవంబర్ 12 : దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంతోపాటు, దళితులతో ఏర్పాటుచేసిన అవగాహన, చైతన్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 17 లక్షల మంది దళితులకు వచ్చే మూడు, నాలుగేండ్లలో ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు.
అందులో భాగంగానే రాబోయే బడ్జెట్లో రూ.25 వేల కోట్లను కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 1,500 దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. దళితబంధు తరహాలో అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అందించే యోచనలో సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దళితబంధు పథకం కోసం ఏటా రూ.25 వేల కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. మహిళల సాధికారతే లక్ష్యంగా తెలం గాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.