మహబూబాబాద్, జనవరి 28: దళితబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అభివర్ణించారు. దళితుల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపుతుందని స్పష్టంచేశారు. శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో దళితబంధు అమలుపై ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. గతంలో పాడి గేదెలు ఇచ్చిన కుటుంబాల ఆర్థిక పరిస్థితిని పరిశీలించాలని అధికారులకు సూచించారు.