ములుగు టౌన్, ఏప్రిల్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు ఎంతో మంచి పథకమని.. ఇలాంటి స్కీమ్ ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్‌కు ములుగు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ములుగు కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ములుగు, భద్రాచలం నియోజక వర్గాల్లోని దళితబంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక్కడ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ప్రతి యూనిట్‌పై కచ్చితమైన అవగాహన ఉండాలన్నారు. ఆదాయం పొందే యూనిట్‌ను ఎంపిక చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఉద్యోగ, ఉపాధితో భరోసా కల్పించేందుకు మరిన్ని పథకాలు తీసుకురావాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. భద్రాచలం నియోజకవర్గంలో 40 మందిని ఎంపిక చేసినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు.