వెల్దండ, సెప్టెంబర్ 19 : కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి తమది, మూగజీవాల ఉసురు తగులుతుందని పాడిరైతులు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు(Dairy farmers) హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై(Srisailam national highway) పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. హైవేను దిగ్భందం చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోగా.. ట్రాఫిక్‌జాం అయ్యింది. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ రాత్రనకా, పగలనకా కష్టపడి పనిచేసి విజయ డెయిరీకి పాలు పోస్తే బిల్లులు చెల్లించడం లేదని, తాము ఎలా బతకాలని ప్రశ్నించారు.
పాడి ఆవులు, బర్రెలకు పశుగ్రాసం కూడా కొనలేక అప్పుల పాలవుతున్నామన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతులను అరిగోస పెడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు విజేందర్‌రెడ్డి, రంగయ్య, యాకుబా, శేఖర్, దేవేందర్, నిరంజన్, ప్రసాద్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.