Karimnagar Dairy | వేములవాడ రూరల్ : వేములవాడ మండలం అగ్రహారం కరీంనగర్ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం వద్ద కరీంనగర్ – సిరిసిల్ల రహదారిపై పాడి రైతులు బైఠాయించారు. పాల డెయిరీకి సంబంధించి పర్మిషన్ లేదని.. టౌన్ ప్లానింగ్ అధికారి, డిఆర్డిఏ, పంచాయతీ అధికారులు సీజ్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న కరీంనగర్ డెయిరీ పాడి రైతులు దాదాపు 200 మంది కరీంనగర్ – సిరిసిల్ల రహదారిపై బైఠాయించారు. గంటన్నర పాటు రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు అర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్డిఓ రాజేశ్వర్ పాడి రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు. డెయిరీని తెరిచే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. మాకు పది రోజులు టైం ఇస్తే పర్మిషన్ తీసుకుంటామని రైతులు చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.
తాము తెచ్చిన పాలను ఎక్కడ పోయాలంటూ ఆర్డిఓ రాజేశ్వరరావును నిలదీశారు. ప్రత్యామ్నయంగా విజయ డెయిరీకి పాలు పోయాలని ఆర్డిఓ సూచించడంతో రైతులందరూ వాగ్వివాదానికి దిగారు. పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. పాల డెయిరీకి వేసిన సీజ్‌ను తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు అధికారులను హెచ్చరించారు.