హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : విజయ పాల రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు సర్కార్ సిద్ధమవుతున్నదా? రైతులకు చెల్లించే ధరలో కోత పెట్టబోతున్నదా? ఎక్కువ ధర ఇవ్వడం వల్లే డెయిరీకి నష్టాలొస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నదా? ఈ ప్రశ్నలకు పాడి రైతులతో పాటు విజయ డెయిరీ వర్గాల్లోనూ ‘అవును’ అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. లీటరు పాల ధరపై రూ.5 వరకు తగ్గించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని, త్వరలోనే అమలు చేయనున్నదని డెయిరీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కొత్త చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, సీఎంవో అధికారుల మధ్య చర్చలు కూడా జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా ధరలు తగ్గించి నష్టాలు పూడ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
విజయ డెయిరీ కొత్త చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లిన పాడి రైతులకు ధర తగ్గింపుపై ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. కొత్త చైర్మన్‌గా నియమితులు కావడంతో ఆయా జిల్లాల పాడి రైతు సంఘాల నేతలు ఆయనను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా తమకు మూడు నెలలుగా రూ.150 కోట్ల వరకు పాల బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి తమ బిల్లులు చెల్లించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సమస్య పరిష్కారానికి ఏం చేద్దామో మీరే చెప్పిండి’ అంటూ రైతులను కోరినట్టు తెలిసింది. ప్రభుత్వంతో మాట్లాడితేనే పరిష్కారం లభిస్తుందని రైతులు చెప్పగా చైర్మన్ కల్పించుకొని ‘ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే విజయ డెయిరీలో రైతులకు చెల్లించే పాల ధర ఎక్కువగా ఉంది.. అందుకే నష్టాలు వస్తున్నాయి’ అని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ సమాచారం. నష్టాల నుంచి బయటపడాలంటే పాల ధర తగ్గించడమే ఏకైక మార్గమని స్పష్టంచేసినట్టు, ఇందుకు అన్ని జిల్లాల పాడి రైతు సంఘాలు సహకరించాలని కోరినట్టు తెలిసింది. కానీ, దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ధర తగ్గింపు ఆలోచన చేయవద్దని, కొత్త సమస్యలు సృష్టించొద్దని కోపానికి రాగా వారి ఆగ్రహాన్ని పసిగట్టిన చైర్మన్ ఆ విషయం పెద్దది కాకుండా జాగ్రత్త పడుతూ ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా బిల్లులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చి పంపినట్టు రైతు సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
పాల బిల్లులు చెల్లించాలని ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. వారికి మద్దతుగా ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురిస్తున్నది. ఈ నేపథ్యంలో సమస్యపై ప్రభుత్వం ఆరా తీసి డెయిరీ అధికారులు, చైర్మన్‌తో చర్చించినట్టు తెలిసింది. రైతులకు చెల్లించే పాల ధర ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే విజయ డెయిరీలో ఎక్కువ ఉండడమే ఇందుకు కారణమని అధికారులు చెప్పగా అవసరమైతే ధర తగ్గించే ఆలోచన చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం 5శాతం వెన్న ఉన్న లీటరు బర్రె పాలకు రూ.40.05 ధర చెల్లిస్తున్నారు. వెన్నశాతం ఎంత పెరిగితే అంత ధర పెంచి ఇస్తున్నారు. ఆవు పాలలో 3 శాతం వెన్న ఉంటే లీటరుకు రూ. 40.25 చొప్పున ఇస్తున్నారు. కరీంనగర్ డెయిరీలో ఆవుపాలకు 3శాతం వెన్న ఉంటే రూ. 33.65, నాగార్జున డెయిరీలో రూ. 33.25 చెల్లిస్తున్నారు. విజయ డెయిరీలో రైతులకు ఎక్కువ ధర చెల్లించడం వల్ల నష్టాలు వస్తున్నట్టు చెప్తుండడం గమనార్హం.
రైతులకు ఎంత వీలైతే అంత మేలు చేయాలని తపించిన మాజీ సీఎం కేసీఆర్ ఇందుకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నారు. నాడు నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని ప్రక్షాళన చేసి లాభాల్లోకి తెచ్చారు. విజయ డెయిరీ బలోపేతం కావాలంటే రైతులు పాలు పోస్తేనే సాధ్యమవుతుందని, డెయిరీ బలోపేతమైతే రైతులను దోచుకునే ప్రైవేటు డెయిరీల ఆగడాలకు కళ్లెం పడుతుందని భావించి పాల ధరను పెంచారు. ప్రైవేట్ డెయిరీల కన్నా ఎక్కువ ధర కల్పించారు. దీంతో డెయిరీకి పాల సేకరణ పెరిగి అభివృద్ధి బాట పట్టింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డెయిరీకి మళ్లీ కష్టాలు, నష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో అక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. ముఖ్యంగా ఈ శాఖకు మంత్రి లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ శాఖ వైపు కన్నెత్తి చూడడంలేదు. ఈ నేపథ్యంలో డెయిరీ మళ్లీ తిరోగమనంలోకి పయనించి రైతులకు బిల్లులు చెల్లించలేని దుస్థితికి దిగజారింది. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ పాల ధర ఎక్కువగా ఉండటం వల్లే నష్టాలు వస్తున్నాయని ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు తగ్గించే ఆలోచన చేస్తుండడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.