భద్రాచలం/ ఏటూరునాగారం, అక్టోబర్ 14: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో దినసరి వేతనంపై పనిచేస్తున్న వర్కర్లు 72గంటల ధర్నాలో భాగంగా ఏటూరునాగారం ఐటీడీఏ వద్ద ఉదయం నుంచి బైఠాయించారు. డీడీ జనార్దన్, ఏ వో రాజ్‌కుమార్ వచ్చి వారితో చర్చించి, సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ.. నెల రోజులుగా 3వేల మంది వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కనీసం వారితో చర్చలు కూడా జరపడంలేదని వాపోయారు.
గిరిజన సంక్షేమ శాఖలో ఏళ్లతరబడి పనిచేస్తున్న కార్మికుల సమస్య లు పరిష్కరించని పక్షంలో మంత్రులు, ఎమ్మల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బ్రహ్మచారి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ హెచ్చరించారు. భద్రాచలం బీఆర్ఎస్ నాయకుడు ఆకోజు సునీల్ సమ్మె శిబిరాన్ని సందర్శించి, వారికి బీఆర్ఎస్ తరఫున మద్దతు తెలిపారు.