BJP | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. ఎన్నికల వేళ సభలు, సమావేశాలు అంటూ హడావుడి జరగాల్సిన సమయంలో రోజుకో నాయకుడు పార్టీని వీడుతున్నారు. ఈ రాజీనామల పర్వంలో తాజాగా జీ వివేక్ వెంకటస్వామి చేరారు. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్ పార్టీకి రాజీనామా చేసి, వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కూడా పార్టీకి రాంరాం చెప్పారు.
వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయాలని భావించారు. టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మకు టికెట్ దక్కింది. దీంతో రాకేశ్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అందరూ ఊహించినట్టుగానే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలో విలువలు కనిపించడం లేదని, కొందరి చేతిలో పార్టీ బందీ అయ్యిందని ఆరోపించారు. మూడేండ్లుగా తనను వ్యక్తిగతంగా వేధించారని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని, అయినా పార్టీ పట్టించుకోలేదని వాపోయారు. జితేందర్‌రెడ్డి కుమారుడికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీలో వారసత్వ రాజకీయాలు, డబ్బు రాజకీయాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. యువతను ధర్మం, సిద్ధాంతాల పేరుతో బీజేపీ వాడుకుంటున్నదని విమర్శించారు.
వివేక్.. వీసిక్స్.. ఫిక్స్
సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి బీజేపీని విడిచి కాంగ్రెస్‌లో చేరడంపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తున్నది. ఆయన ఆరుసార్లు పార్టీ మారడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. మూడుసార్లు కాంగ్రెస్‌లో, రెండుసార్లు బీఆర్ఎస్లో చేరారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ‘ఆయన మీడియా సంస్థకు వీ6 అనే పేరు ఎందుకు పెట్టారో తేలిపోయింది. వివేక్ ఆరు సార్లు పార్టీ మారుతారనే అర్థం వచ్చేలా ముందే పేరుపెట్టారు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీలో ఆయన మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరిన బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘మ్యానిఫెస్టోను బీజేపీ ఒకటికి రెండుసార్లు చెక్‌చేసుకోవాలి. ఎందుకంటే పోతూపోతూ ఏం రాశాడో తెల్వదు’ అని కౌంటర్లు వేస్తున్నారు.
కొండా.. అలక?
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ పెద్దలపై అలిగినట్టు సమాచారం. పొత్తులో భాగంగా తమకు శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు కావాలని జనసేన కోరుతున్నది. ఈ రెండు టికెట్లు ఇవ్వడానికి బీజేపీ దాదాపు సిద్ధమైంది. దీంతో తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్క టికెట్ జనసేనకు ఇచ్చినా పార్టీకి రాజీనామా చేస్తానని కొండా అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. దీంతో పొత్తులపై చర్చలు మళ్లీ మొదటికి వచ్చాయని నేతలు చెప్పుకుంటున్నారు.