Mobile Phone | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సెల్ఫోన్ల వినియోగంపై గందరగోళం నెలకొన్నది. రోజుకో ఆదేశాలు.. పూటకో ఉత్తర్వులను తలపిస్తున్నది. ఇటీవలే టీచర్లు బడుల్లో సెల్ఫోన్ వాడొద్దని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల వేళల్లో తరగతి గదుల్లో సెల్ఫోన్లు వినియోగించవద్దన్నది. విద్యార్థులు కూడా సెల్ఫోన్లు వాడకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. వాడితే చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా సెల్ఫోన్లు వాడొచ్చని మళ్లీ ఆదేశాలిచ్చింది.
అదేపనిగా సెల్ఫోన్ వాడొద్దని కేవలం ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఫేషియల్ అటెండెన్స్, ఇంటర్నెట్, పాఠాల బోధనకు మాత్రమే సెల్ఫోన్ వాడొచ్చని స్పష్టంచేసింది. అధికారిక పనుల కోసమే సెల్ఫోన్లు వినియోగించాలని నొక్కి చెప్పింది. విద్యాశాఖ ఆదేశాలతో పలు జిల్లాల డీఈవోలు సెల్ఫోన్ వినియోగంపై స్థానికంగా ఉత్తర్వులిచ్చారు. ముందు హడావుడిగా ఉత్తర్వులివ్వడం.. ఆ తర్వాత నాలుక కరుచుకుని మళ్లీ మార్చడంపై టీచర్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.