హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలపై వరుసగా భారాలు వేస్తూనే ఉన్నదని విమర్శించారు.
ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని, ప్రజలను నమ్మబలుకుతూ, ప్రజలపై భారం మోపడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం అన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామానికి చెందిన నీట్ విద్యార్థిని ఇందు మృతి చెందినట్లు తెలిపారు. కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన విద్యార్థినిని శవంగా మార్చి కుటుంబ సభ్యులకు అప్పగించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థిని మృతికి కారకులైన డాక్టర్లను డిస్మిస్ చేయాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు.