Weather Updates | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తున్నది. దీనికి ఇప్పటికే ‘శక్తి’ అని నామకరణం చేశారు. శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ దక్షిణ అరేబియా సముద్రంలోని తీర ప్రాంతాల్లో ప్రభావం చూపించనున్నది. వచ్చే వారం రోజులు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తెలంగాణలో రోజంతా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని 80శాతం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాగా, నైరుతి రుతుపవనాలు జూన్ 10వ తేదీ నాటికి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు జూన్ నెలాఖరు వరకు దేశమంతటా విస్తరిస్తాయి. ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశం ఉంది.