Weathter Alert | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు భార త వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 6 గంటల నుంచి ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం.. ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నానికి ఆగ్నేయంగా 380 కి.మీ, ఒడిశాలోని పారాదీప్‌కు 380 కి.మీ, పశ్చిమబెంగాల్లోని దిఘాకు నైరుతిగా 530 కి.మీ, బంగ్లాదేశ్‌లో ఖెపుపరాకు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ వివరించింది.
ఇది క్రమంగా ఆగ్నేయ దిశలో పయనించి నవంబర్ 18న ఉదయం మోంగ్లా-ఖెపుపరా మధ్య తీరం దాటుందని అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కి.మీ వేగంతో వీస్తాయని, రెండురోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. వాయుగుం డం ప్రభావంతో బెంగాల్, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మోస్తరు నుంచి సాధారణ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. నాగాలాండ్, మణిపూర్, మిజో రాం, త్రిపుర, దక్షిణ అసోం, మేఘాలయలోనూ శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈశాన్య రుతుపవనాలు, వాయుగుండం ప్రభావంతో తమిళనాడువ్యాప్తంగా బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.