Cyber Kidnapping | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఇది ఆన్లైన్ కిడ్నాపింగ్ గేమ్.. ఇది ఎలా ఉంటుందంటే.. సైబర్ నేరగాళ్లు మీ డాటాను సేకరించి మీ ఫొటోలను మార్పింగ్ చేసి మీరు కిడ్నాప్ అయినట్టు మీ పిల్లలకు పంపుతారు. కిడ్నాప్ నుంచి బయటపడాలంటే తనని తానే కిడ్నాప్ చేసుకొనేలా, ఫోన్ వాడకుండా ఉండేలా ఆదేశాలిస్తారు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి కిడ్నాప్‌కు గురైనట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు తమకు పంపాలని డిమాండ్ చేస్తారు. పిల్లల నుంచి వచ్చిన కిడ్నాప్ ఫొటోలను వారి తల్లిదండ్రులకు పంపి వాళ్లూ గేమ్ ఆడుతారు. ‘మీ అబ్బాయి లేదా అమ్మాయిని కిడ్నాప్ చేశాం.. పైసలిస్తే వదిలేస్తాం. లేకుంటే చంపేస్తాం..’ అని బెదిరింపులకు దిగుతారు. ఇదంతా పిల్లలకు తెలియకుండానే జరుగుతుంది. ఫొటోలు చూసి తల్లిదండ్రులు ఆందోళనతో సైబర్ నేరగాళ్లు అడిగినంత మొత్తం ముట్టజెప్పుతారు. ఇప్పుడిదే సైబర్ నేరగాళ్ల కొత్త పంథా. పైన చెప్పిన కథ అంతా అమెరికాలో తాజాగా జరిగిన ఘటనే. ఇలాంటి ఘటనలు మన దగ్గరా జరిగే అవకాశాలు ఉన్నాయని, పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సరికొత్త ప్లాన్‌ను సైబర్ నేరగాళ్లు పక్కాగా అమలు చేశారని, పిల్లల ప్రవర్తన, ఫోన్ వాడకం, ఇతర అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గేమ్స్ నుంచి డాటా దొంగిలించే అవకాశం
పిల్లలు వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్స్‌పై తల్లిదండ్రుల నియంత్రణ ఉండాల్సిన రోజులివి. వారికి తెలియని లింక్‌లను ఓపెన్ చేయడం వల్ల మన డాటాను పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెడతాం. మన పిల్లలు సైబర్ కిడ్నాపర్ల బాధితులు కాకూడదనుకుంటే వారు ఎలాంటి గేమ్స్ అడుతున్నారు? నెట్లో ఏం చూస్తున్నారు? ఏం డౌన్లోడ్ చేస్తున్నారు? ఎలాంటి విషయాలు చర్చిస్తున్నారు? వారి ప్రవర్తన ఎలా ఉంది? అనే విషయాలపై దృష్టిపెట్టాలి. కొత్త సైబర్ మోసాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
– అనిల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్‌నౌ ఫౌండేషన్