హైదరాబాద్ సిటీబ్యూరో/చిక్కడపల్లి, జూన్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 352 కింద కేసు నమోదు చేశారు. కేటీఆర్‌తోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కూడా సైబర్ క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 67, బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 352 కింద కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ లీగల్ టీమ్ కేటీఆర్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డిని కించపరిచేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్, హైకోర్టు న్యాయవాది దోనేటి భాను, కాంగ్రెస్ నేతలు శనివారం చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.