Hyderabad | శేరిలింగంపల్లి, అక్టోబర్ 15: సైబరాబాద్ ఐటీ కారిడార్ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత సేఫ్‌జోన్‌గా భావించే గచ్చిబౌలిలో సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై ఆటో డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి లైంగికదాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన పోలీస్‌శాఖ పనితీరుపై మరోసారి విమర్శలకు తావిచ్చింది.
చెన్నై నగరానికి చెందిన ఓ యువతి(32) సోమవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో నగర శివారులోని బీహెచ్ఈఎల్ వద్ద బస్సు దిగింది. అనంతరం అక్కడి నుంచి నానక్‌రాంగూడకు వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకుంది. సదరు ఆటో డ్రైవర్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వరకు విడిచిపెడతానని ఒప్పందం చేసుకున్నాడు. అక్కడి నుంచి నానక్‌రాంగూడకు చాలా ఆటోలు అందుబాటులో ఉంటాయని చెప్పడంతో ఆమె ఆటో ఎక్కింది. మార్గమధ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో మసీదు బండ కమాన్ దాటగానే జీహెచ్ఎంసీ అద్దె క్యాంటీన్ పక్కకు ఆటోను డ్రైవర్ మళ్లించాడు. ఆ రూట్లో రాకపోకలు లేకపోవడం.. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న తన స్నేహితుడితో కలిసి యువతిపై లైంగికదాడి చేశారు. యువతి కేకలు విన్న జోమోటో డెలివరీబాయ్తో పాటు మరికొందరు వాహనదారులు ఆటోవద్దకు చేరుకున్నారు. వారిని గమనించిన ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే బాధితురాలని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత భరోసా సిబ్బంది సహకారంతో యువతిని కొండాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా దవాఖానకు తీసుకెళ్లారు. బాధితురాలు తల, చేతులకు తీవ్ర గాయాలుండడంతో ఆ తర్వాత గాంధీ దవాఖానకు తరలించారు.
ఈ ఘటనలో నిందితుడిని మంగళవారం రాత్రి బోరబండలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఘటనాస్థలంలో లభించిన ఆటో కొత్తది కావడం, నంబర్ ప్లేట్ లేకపోవడంతో నిందితుడి గుర్తింపు ఆలస్యమైనట్టు తెలిసింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు సమాచారం. కాగా, బాధితురాలు ఆ రాత్రి బీహెచ్ఈఎల్ వైపు ఎందుకెళ్లింది. ఆమె ఎక్కడ పనిచేస్తున్నదనే విషయాలపై వివరాలు సేకరించారు. బాధితురాలు నిద్రమత్తులో ఉండడంతో వైద్యానికి సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ అఘాయిత్యానికి పాల్పడింది ఆటో డ్రైవర్ ఒక్కడేనని వెల్లడించారు. బాధితురాలు చెబుతున్న విషయాలు కూడా వేర్వేరుగా ఉన్నాయని పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
గచ్చిబౌలి పరిధిలో నిత్యం వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రాత్రివేళల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి సురక్షిత రవాణా సౌకర్యం పేరిట గతంలో ప్రతి ఆటో వివరాలను పోలీస్ రికార్డుల్లో నమోదు చేసుకొని ‘మై ఆటో ఈజ్ సేఫ్’ అనే స్టిక్కర్లను పోలీసులు అంటించారు. ఈ ఆటోలపై పోలీసుల నిఘా గతంలో కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ నిఘా లోపం వల్లే ఈ ఘటన జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి.