హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు రెండోరోజైన శుక్రవారం కీలక విషయాలను గుర్తించారని తెలిసింది. ఐబొమ్మ రవికి సినిమాలు సైప్లె చేస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు. తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను రవి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మూవీరూల్స్ వెబ్సైట్ నుంచి కూడా రవి పెద్దఎత్తున సినిమాలు కొనుగోలు చేసి, క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు చేసినట్టు తెలుసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో రవి సినిమాలు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. కరేబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసుకున్న రవి.. 20 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నట్టు గుర్తించారు.
రవి విచారణలో చెప్పిన వివరాలనే మళ్లీమళ్లీ చెప్తున్నట్టు పోలీసు అధికారులు నిట్టూరుస్తున్నారు. ‘నా ద్వారా వెబ్సైట్లు ఓపెన్ అయినట్టు చూపిస్తే, వాటిని క్లోజ్ చేస్తాను. అంతేతప్ప అన్నింటికీ నన్ను బాధ్యుడిని చేయొద్దు’ అని రవి చెప్తున్నట్టు తెలిసింది. రవి పోలీసుల కస్టడీలో ఉండగానే ఐబొమ్మ వన్ పేరుతో మరో వెబ్సైట్ ఏర్పాటు కావడం, ఎస్బీఐ పోర్టల్‌లో ఐబొమ్మ ప్రత్యక్షమవడం, ఐబొమ్మ వెబ్సైట్ క్లిక్ చేస్తే మూవీరూల్స్కు రీడైరెక్ట్ కావడాన్ని పోలీసులు గుర్తించారు. వీటిని అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇమ్మడి రవిపై నమోదైన మరో నాలుగు కేసులలోనూ అరెస్ట్ చేసి, పైరసీ నెట్‌వర్క్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.