సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా డీపీతోనే అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు లొంగకపోవడంతో ఆఖరికి 50వేలు వెంటనే ఇవ్వాలని.. లేదంటే డ్రగ్స్ కేసు బుక్ చేస్తానని చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా, సదరు వ్యాపారవేత్తకు పాకిస్థాన్ నుంచి కాల్ వచ్చినట్లుగా సైబర్ నేరగాళ్లు గుర్తించారు. సైబర్ నేరాలపై అవగాహన పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారని.. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.