హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు ప్రత్యక్షం అవడంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఈ తరహా సమస్యను ఈ నెల 10వ తేదీనే గుర్తించినా సకాలంలో ఫిర్యాదు చేయలేకపోయారు. tshc.gov.in వెబ్సైట్లో కేసులకు సంబంధించిన పలు కాపీలను డౌన్లోడ్ చేస్తున్న ప్రతిసారీ కాపీల పీడీఎఫ్‌లకు బదులుగా ‘బీడీజీ స్లాట్’ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ కావడంతో సిబ్బంది కంగుతిన్నారు.
హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైందని తెలుసుకొని కోర్టు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ) టీ వెంకటేశ్వరరావు రాష్ట్ర డీజీపీకి, సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తు తెలియని నేరగాళ్లపై అనధికారిక యాక్సెస్, ఐడెంటిటీ దొంగతనం కింద కేసు నమోదు చేశారు. హ్యాకర్లను గుర్తించి, పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌క్రైమ్ పోలీసు బృందం హైకోర్టును సందర్శించి ఫిర్యాదు వివరాలను సేకరించింది.
హ్యాకింగ్ సమస్య ఈనెల 10వ తేదీనే వెలుగు చూసినా.. దానిని సకాలంలో గుర్తించడంలో కోర్టు సాంకేతిక సిబ్బంది విఫలమయ్యారు. దీంతో నాటి నుంచి శనివారం వరకూ ఎంత సమాచారం చోరీ అయి ఉంటుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అధికార వైబ్సైట్లో ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఏ కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది? వాటిని విచారించే న్యాయమూర్తులు ఎవరు? రిజర్వు తీర్పుల వివరాలు కూడా ఉంటాయి. ఎంతో సున్నితమైన సమాచారం బయటికి లీక్ అయితే.. ఎన్నో చిక్కులు వస్తాయని ఐటీ నిపుణులు అంటున్నారు.
హైకోర్టు ప్రతిష్ఠకు భంగం కలిగించిన ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు త్వరగా నిందితులను పట్టుకుంటేనే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయి. మొత్తానికి ఈ ఘటన హైకోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రజలలో కలకలం సృష్టించింది. గతంలో ఢిల్లీకి చెందిన ఓ హ్యాకర్ ఏకంగా తెలంగాణ పోలీసు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి, అందులోని సమాచారం దొంగిలించి.. డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టాడు. హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఎవరు, వారి ఉద్దేశం ఏమిటి? వారు సర్వర్లోకి ఎలా యాక్సెస్ పొందారు? సర్వర్ భద్రతలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ హైకోర్టు తన అధికారిక వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సర్వర్లపై నిర్వహిస్తున్నది. కోర్టుకు సంబంధించిన కాజ్ లిస్టులు, కేసుల స్థితి, పరిపాలనా నోటీసులు, తీర్పులకు సంబంధించిన కాపీలు, కొన్ని రిజర్వ్ తీర్పులు వంటి ముఖ్యమైన సమాచారం ఇకడే పీడీఎఫ్ రూపంలో లభిస్తుంది.
ఈ హ్యాకింగ్ విషయం తెలుసుకున్న ఎన్ఐసీ అధికారులు.. వెబ్ సైట్ పనితీరును సమీక్షించి.. తాత్కాలికంగా సమస్యను పరిష్కరించినట్టు తెలిసింది. హైకోర్టు వెబ్సైట్లోకి నిందితులు ఏ రూపంలో చొరబడ్డారు? ఏమైనా డాటా దొంగిలించారా? ఎలాంటి బగ్స్ ఉపయోగించారు? ఆ డాటాను ఎక్కడైనా విక్రయానికి పెట్టారా? అనే విషయాలపై అటు ఎన్ఐసీ, ఇటు సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను గుర్తించేందుకు ఎన్ఐసీ విచారణ నివేదిక కీలకం కానుందని సైబక్రైమ్స్కు చెందిన ఓ అధికారి తెలిపారు. రిజిస్ట్రార్ టీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘హ్యాకర్లు హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీసేందుకే హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. ఎన్ఐసీ అధికారులు హ్యాకింగ్ గురించి దర్యాప్తు చేస్తున్నారు, వారి నివేదిక ఇంకా అందలేదు. ఈ పరిస్థితుల్లో, ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.