హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సైబర్ నేరాలపై ఫిర్యాదులు, ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల గణాంకాలను విడుదల చేసిన ఆమె.. నిరుడు ఏప్రిల్ వరకు పోల్చితే సైబర్ నేరాల ఫిర్యాదుల్లో 11%, ఆర్థిక నష్టాల్లో 19% తగ్గుదల నమోదైందని తెలిపారు. ప్రజలు కోల్పోయిన నగదు రికవరీ శాతం13నుంచి 16శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం చేసుకుంటూ.. సైబర్ నేరాల తగ్గుముఖం పట్టేందుకు విశేష కృషిచేశామని వివరించారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించామని తెలిపారు. 1930 హెల్ప్‌లైన్, చాట్‌బాట్ ద్వారా వేగంగా సైబర్ నేరస్థులకు వెళ్లిన నగదును నిలిపివేయగలిగామని ఆమె వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 7,575 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 626మందిని అరెస్టు చేశామని చెప్పారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను గుర్తించేందుకు డేటా విశ్లేషణ చేయడంతోపాటు, డిజిటల్ ప్రొఫైలింగ్, ఓఎస్ఐఎన్టీ వంటి సాధనాలను సీఎస్బీ వినియోగిస్తున్నద తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
5 తర్వాతనే తెలంగాణకు ప్రభాకర్‌రావు? ; పాస్‌పోర్టు పునరుద్ధరణకు ఇండియన్ ఎంబసీలో సంప్రదింపు
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలున్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు ఈనెల 5 తర్వాత రాష్ర్టానికి రానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన ఆదివారం అమెరికాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించినట్టు తెలిసింది. రద్దయిన తన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని ఎంబసీ అధికారులను కోరారు. దీంతోపాటు ట్రావెల్ ఎమర్జెన్సీ పర్మిట్ ఇవ్వాలంటూ ప్రభాకర్‌రావు రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రావెల్ ఎమర్జెన్సీ పర్మిట్‌ను ఎంబసీ అధికారులు జారీ చేసినట్టు సమాచారం. వచ్చేవారం ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇండియాకు చేరుకున్న 3 రోజుల తర్వాత ఆయన సిట్ ఎదుట హాజరుకానున్నారు.