హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): యువతకు కమీషన్ల ఆశ చూపి సైబర్ మోసాల ఉచ్చులోకి లాగుతున్నారు నేరగాళ్లు. కోదాడ పరిసర ప్రాంతాల్లో ని గ్రామాల్లో చాలా మంది యువతి, యువకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. సైబర్ నేరాల కేసుల్లో 23 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీసీఎస్ భవన్లో సైబర్ క్రైమ్ డీసీపీ దార కవి త మాట్లాడుతూ ‘కోదాడ పరిసరాల్లోని రెం డు గ్రామాల్లో నివసిస్తున్న వందలాది మంది యువతి, యువకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చు లో చిక్కుకున్నట్టు వెల్లడైంది.
తొలుత ట్రేడింగ్లో లాభాలంటూ సైబర్ మోసగాళ్లు విసిరిన ఉచ్చులో కొంతమంది యువత చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నారు. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో బ్యాంకు ఖాతాలు ఇస్తే కమీషన్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన డబ్బులను డాలర్లుగా పంపిస్తే 5 శాతం కమీషన్ అంటూ ఆశ చూపారు. దీంతో డబ్బులు పోగొట్టుకున్న యువతతోపాటు చాలా మంది బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ట్రేడింగ్ కేసు దర్యాప్తులో రెండు ఖాతాలు కోదాడ పరిసర గ్రామాల్లోనివిగా గుర్తించాం. అక్కడికి వెళ్లి ఆరా తీయడంతో ఒకటి కాదు.. రెండు కాదు.. వందల మంది యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు తేలింది’ అని వెల్లడించారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సైబర్ నేరాలకు..
అరెస్టు అయిన వారిలో ఉత్తరప్రదేశ్లో స్వ చ్ఛంద సంస్థను నడుపుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కమలేశ్కుమారి కూడా ఉన్నదని డీసీపీ తెలిపారు. ఈమె స్వచ్ఛంద ఖాతాను వాడుకున్న సైబర్ నేరగాళ్లు భారీగా కమీషన్ ఇచ్చారని చెప్పారు. అరస్టైయిన వారిలో విదేశాలలో ఉన్న కీలక సూత్రధారులకు భారత్ నుంచి సహకరిస్తున్నవాళ్లూ ఉన్నారని పేర్కొన్నారు.