హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): గోదావరిలో నికర, మిగులు, వరద జలాలనేవే లేవని, ఆల్వాటర్స్ అనే ఒకేఒక్క విధానం ఉన్నదని ఎప్పటినుంచో నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వరద జలాల పేరుతో బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అవే ప్రశ్నలను తాజాగా సీడబ్ల్యూసీ సంధించింది. ‘గోదావరిలో వరద జలాలను ఎలా నిర్ధారించారు? వాటిని గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) గుర్తించిందా? అవార్డులో పరిగణనలోకి తీసుకున్నదా? పోలవరం వద్ద 129 రోజులపాటు వరద ప్రవాహం కొనసాగుతుందా?’ అంటూ బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
ఆయా అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. అందుకు సంబంధించిన వివరాలను పూర్తిగా సమర్పించాలని సూచించింది. ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీల వరద జలాలను బనకచర్లకు తరలించేందుకు రూ.81 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫిజుబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను ఇటీవల సీడబ్ల్యూసీకి సమర్పించింది. సదరు పీఎఫ్ఆర్ను అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఆ రిపోర్టులోని పలు అంశాలు, ఏపీ ప్రతిపాదనలపై అనేక సందేహాలను వ్యక్తంచేసింది. ఏపీ సర్కారుకు ప్రత్యేకంగా లేఖ రాసింది.
ఇంద్రావతి (జీ11), శబరి (జీ12), లోయర్ గోదావరి (జీ10) సబ్ బేసిన్ల నుంచి నీటి లభ్యతపై అధ్యయనం చేయగా, ఆయా సబ్ బేసిన్లలో మిగులుజలాలే లేవని పీఎఫ్ఆర్ రిపోర్టులోనే పేర్కొన్నారని సీడబ్ల్యూసీ తెలిపింది. ఆయా సబ్ బేసిన్లలో అందుబాటులో ఉన్న జలాల కంటే ఏపీ నిర్మించిన, నిర్మాణ దశలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల నీటి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, పూర్తయిన, ప్రణాళికల దశలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన కచ్చితమైన నీటి కేటాయింపులు, వినియోగ లెక్కలను సమర్పించాలని, ఆయా ప్రాజెక్టుల ప్రణాళికల విశ్వసనీయతను తెలియజేయాలని ఏపీకి సీడబ్ల్యూసీ సూచించింది.
2010లో సీడబ్ల్యూసీ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం బహుళార్ధసాధక సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌ను పరిశీలించాలంటే, ప్రతిపాదిత ప్రాజెక్టుకు 75% డిపెండబులిటీ ప్రకారం నీటి లభ్యత ఉండాలని సీడబ్ల్యూసీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో గోదావరి ట్రిబ్యునల్ ఏపీతోపాటు బేసిన్ రాష్ర్టాలకు కేటాయించిన జలాలు, అందులో ఆయా రాష్ర్టాల నీటి వినియోగాల లెక్కలను అధ్యయనం చేయాల్సి ఉం టుందని, ఆ తరువాతే 200 టీఎంసీల నీటి మళ్లింపు సాధ్యాసాధ్యాలను లెకించాలని స్పష్టంచేసింది. అయితే ప్రతిపాదిత లింక్ ప్రాజెక్ట్ అధికారు లు సమర్పించిన రిపోర్టులోని ఎక్సల్షీట్లో అలాంటి గణన లేదని, గణాంకాల వివరాలు లేవని సీడబ్ల్యూసీ పేర్కొన్నది. నీటి గణన వివరాలు, అం దుకు అనుసరించిన సూత్రాలను వివరిస్తూ ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అంతేకాకుండా, ప్రాజెక్టులవారీగా, సాగునీటి ప్రాం తాలవారీగా, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల రికార్డుల వారీగా నీటిగణన లెక్కలు సమర్పించాలని స్పష్టంచేసింది. ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను ఏపీతోపాటు గోదావరి బేసిన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ పూర్తిగా ఉపయోగించుకుంటాయని, అందుకు సంబంధించిన లెక్కలను అందించాలని తెలిపింది.
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను తరలించడమని సీడబ్ల్యూసీ గుర్తించింది. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 510 క్యూమెక్కుల (18 వేల క్యూసెక్కుల) సామర్థ్యంతో మరో కాలువను తవ్వి కృష్ణా మీదుగా మళ్లించనున్నట్టు పీఎఫ్ఆర్ రిపోర్టులో అధికారులు ప్రణాళికలను సిద్ధంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. మళ్లించ తలపెట్టిన జలాలను ఏ లెక్కన గుర్తించారు? ఆ జలాలు అవార్డులో భాగమా? కాదా? అనేది స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుందని ఏపీకి సీడబ్ల్యూసీ కరాఖండిగా తేల్చిచెప్పింది. 510 క్యూమెక్కుల చొప్పున 24 గంటలపాటు నీటిని మళ్లించినా 200 టీఎంసీల జలాలను మళ్లించాలంటే దాదాపు 129 రోజుల సమయం పడుతుందని సీడబ్ల్యూసీ పేర్కొన్నది. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద 129 రోజులపాటు ఆ మేరకు వరద ప్రవాహాలు ఉంటాయా? అని ప్రశ్నించింది.