సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్‌పీఐసీసీసీ) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలతో కలిసి విస్తరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రభుత్వం నిర్మించగా గత ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ఇటీవల 400 మంది సిబ్బందిని కేటాయించింది. ఇందులో అదనపు డీజీ ర్యాంకుతో పాటు ఒక డీఐజీ, ఇద్దరు ఎస్పీలు, నలుగురు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు ఇతర సిబ్బందిని నియమించింది. ఇందులో భాగంగా ఇటీవల కమాండ్ అండ్ కంట్రోల్‌కు పలువురు అధికారులు, సిబ్బందిని బదిలీ చేయగా.. వారు వివిధ ర్యాంకులలో బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి టీఎస్‌న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోల సేవలు కొనసాగుతున్నాయి. కాగా సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ టీఎస్‌పీఐసీసీసీ డైరెక్టర్‌గా టవర్-బీలో బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవలు వేగంగా ఇక్కడి నుంచి విస్తరించేందుకు వివిధ ప్రాజెక్టు పనులు ఈ టవర్స్‌లో కొనసాగుతున్నాయి. ఈ పనులను పరిశీలించిన సీపీ అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఆయా ప్రాజెక్టుల అధికారులకు కార్యాలయాలను కేటాయించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… సీసీసీ లక్ష్యాలను వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డాటా విశ్లేషణ, ప్రజా సేవలో అవసరమైన వివిధ రకాల అప్లికేషన్లు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ఇతర విభాగాలతో కలిసి సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించాలనేది ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా మల్టీ ఏజెన్సీ ఆపరేషన్‌కు ఆయా విభాగాలను అనుసంధానం చేయాలన్నారు. ఆయా విభాగాల్లో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ, పెండింగ్‌లో ఉండే పనులు పూర్తి చేయాలని చెప్పారు. డయల్ 100 సేవలు, మల్టీ ఏజెన్సీ సెంటర్ నిర్వహణ, విపత్తులు, నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్
పరిమల హనునుతన్, ఎస్పీ పుష్ప తదితరులు
పాల్గొన్నారు.