హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : కొత్త డీజీపీగా 1991వ బ్యాచ్ అధికారి సీవీ ఆనంద్ పేరును రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింఆది. ఇప్పటికే రెండుసార్లు ఆయనను ఊరించి నిరుత్సాహ పరిచిన డీజీపీ పదవి.. ఆయన కోరుకున్నట్టే త్వరలో వరించే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే యూపీఎస్సీ నుంచి తెలంగాణ రాష్ర్టానికి సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు వచ్చాయి. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీగా ఉన్న బీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేస్తుండగా.. ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ పేరు ప్రకటించనున్నట్టు సమాచారం. కాగా, రాష్ట్రం నుంచి ఐదుగురి పేర్లు యూపీఎస్సీకి పంపగా వారిలో అర్హులైన ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ర్టానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో డీజీపీ నియామకం జరుగడం లేదని హైదరాబాద్‌కు చెందిన టీ ధన్‌గోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వింటున్న హైకోర్టు డీజీపీ నియామక ప్రక్రియపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూనే ఉన్నది.
ఇదే అంశంపై హైకోర్టులో పలు దఫాలుగా జరుగుతున్న విచారణలో భాగంగా ఈనెల 3న జరిగిన విచారణలో జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఎప్పటిలోగా రెగ్యులర్ డీజీపీని ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రక్రియ తుదిదశకు వచ్చిందని, మార్చి 12న యూపీఎస్సీ నుంచి సిఫార్సులు అందాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ఆ జాబితాలోని పేర్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు రెండు వారాల గడువు కావాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ప్రభుత్వ నిర్ణయం జాప్యమైందని, రెండు వారాల గడువు ఇస్తే యూపీఎస్సీ సిఫార్సు జాబితా మేరకు ప్రభుత్వం డీజీపీ నియామకం చేపడుతుందని ఏజీ చెప్పారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్ సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌కు సంబంధించి తుది విచారణ ఈనెల 13న జరుగనుండటంతో అదే రోజున ప్రభుత్వం నిర్ణయించిన సీవీ ఆనంద్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
డీజీపీగా తన ఉద్యోగకాలం పొడిగిస్తారని ఆశలు పెట్టుకున్న బీ శివధర్‌రెడ్డి పేరు యూపీఎస్సీ సూచించిన జాబితాలో లేకపోవడంతో ఆయన ఉద్యోగ విరమణ అనివార్యమైంది. దీంతో ఈనెల 14 తర్వాత తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ పేరు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రకాశ్‌సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ధన్‌గోపాల్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు శాశ్వతప్రాతిపదికన సీవీ ఆనంద్ పేరు ప్రకటిస్తారని సమాచారం. ఈనేపథ్యంలో తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు ఉండనున్నట్టు తెలిసింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు యువ ఐపీఎస్‌లతో పాటు, సీనియర్లకు కూడా స్థానచలనం ఉంటుందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే, సీవీ ఆనంద్ రెండేండ్ల డీజీపీ ఉద్యోగ కాలం ముగిసే నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై ఎన్నికల కమిషన్ వేటువేయగా ఆ ఆదేశాల నేపథ్యంలోనే ఆయన డీజీపీగా కొనసాగే అవకాశం ఉండబోదని పోలీసు వర్గాలు అంటున్నాయి. కాగా సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తే రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మహిళా డీజీకి అవకాశం కల్పించనున్నట్టు తెలిసింది.