హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): నిమిషం కూడా కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నామని సాక్షాత్తూ విద్యుత్తు శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి డబ్బా కొడుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. విద్యుత్తు సరఫరా విషయంలో ఆ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరెంటు సమస్య కోతలతో ఇబ్బంది పడుతున్నామని ఓ వినియోగదారుడు ఏడీఈ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్)కి ఫోన్ చేస్తే ‘కరెంటు ఇట్లనే పోతది.. ఇన్వర్టర్ కొనుక్కోండి’ అంటూ ఉచిత సలహా ఇవ్వడంతో నివ్వెరపోయాడు.
అమీర్‌పేట పరిసర ప్రాంతమైన ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ విద్యుత్తు వినియోగదారుడు (ప్రొఫెసర్) తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌తో పాటు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో కలిగిన విద్యుత్తు అంతరాయాలపై మాట్లాడుతూ ‘నేను ఎల్లారెడ్డిగూడ జేపీనగర్‌లోని కీర్తి అపార్ట్మెంట్లో నివాసం ఉంటాను. మా అపార్ట్‌మెంట్‌తో పాటు చుక్కల ప్రాంతాల్లో తరచూ కరెంటు పోతున్నది. కరెంట్ కోతలతో నరకం చూపిస్తున్నారు. ఈ విషయంలో చాలాసార్లు విద్యుత్తు అధికారులతో మాట్లాడిన. నిన్న చాలా సార్లు పోయింది, ఈ వాళ మధ్యాహ్నం కూడా ఎక్కువ సేపు పోయింది. ఇప్పుడు కూడా కరెంటు లేదు. నిన్న పొద్దున ఏడీఈతో మాట్లాడితే కరెంటు ఇట్లనే పోతది.. ఇన్వర్టర్ కొనుక్కోండి సార్ అని చెప్పిండు.
ఇన్వర్టర్, జనరేటర్ పెట్టుకునేట్టు ఉంటే మీకెందుకు కరెంటు బిల్లులు కట్టాలి? అని అడిగితే దానికి ఆయన రకరకాల సమాధానం చెప్పారు. సమస్యలో తమ ప్రమేయమే లేదని తప్పించుకున్నారు. మళ్లీ సోమవారం ఉదయం కరెంట్ పోతే ఆపరేటర్‌కు ఫోన్ చేసిన. కేబుల్ కట్ అయిందని చెప్పాడు. మొన్ననే బాగు చేసినం.. మళ్లీ పోయిందన్నాడు. కొద్ది రోజులకే ఎట్లా పోయిందని అడిగితే అది కాంట్రాక్టర్‌కు తెలుసు అని చెప్పాడు. ఇక నాకర్థమైందేంటంటే ఎవరికి వారు తప్పించుకునేందుకు ఒకరిపై ఒకరు తోసుకుంటున్నారే తప్ప, సమస్య పరిష్కారానికి మాత్రం కృషి చేస్తలేరు’ అని తనకు కలిగిన అసౌకర్యాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.