ముత్తారం, మే 15: కరెంట్ తీగెల మరమ్మతుల సాకుతో విద్యుత్తు అధికారులు ఏపుగా పెరిగిన హరితహారం వృక్షాలను నరికేస్తున్నారు. కొమ్మలు మాత్రమే తొలగించాల్సి ఉండగా ఏకంగా పెద్దపెద్ద చెట్లను కొడుతుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో కేసీఆర్ హయాంలో హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగి రోడ్లకు ఇరువైపులా హరిత శోభను తెచ్చాయి.
అయితే కరెంట్ మరమ్మతుల పేరిట విద్యుత్తు అధికారులు రెండు రోజుల క్రితం సుమారు 40 చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేయించారు. తీగెలకు తగిలిన చోట కేవలం కొమ్మలను మాత్రమే కొట్టివేయాల్సి ఉండగా ఏకంగా పెద్ద పెద్ద చెట్లనే తొలగించారు. విద్యుత్తు అధికారుల తీరుపై పర్యావరణ ప్రేమికులు భగ్గుమంటున్నారు. ఈ విషయమై ఎస్ఈ సుదర్శన్‌ను సంప్రదించగా, చెట్ల నరికివేతపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.