Power Cuts | ఆత్మకూరు (ఎం), జూలై 6: భూముల రిజిస్ట్రేషన్లకూ కరెంటు కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రాల్లో విపరీతంగా కోతలు ఉండటంతో జనం అవస్థలు పడుతున్నారు. ధరణిలో భూమి పట్టా చేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయదారులు కోతల కారణంగా గంటల తరబడి నిరీక్షించారు.
ఈ ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం)లో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్‌కు పలు గ్రామాల నుంచి క్రయ, విక్రయదారులు వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కనీసం 15 సార్లు కరెంట్ వచ్చిపోవడంతో ధరణి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలిగింది. 10 నిమిషాల్లో పూర్తవ్వాల్సిన పని కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది.
దాంతో క్రయ, విక్రయదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మరోవైపు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు అంధకారంలోనే విధులు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. కేసీఆర్ పాలనలో కరెంట్ 24 గంటలు ఉండేదని, ధరణిలో రిజిస్ట్రేషన్ 10 నిమిషాల్లో పూర్తయ్యేదని గుర్తుచేసుకున్నారు.