అచ్చంపేట, ఆగస్టు 7 : ‘ఎక్కడైనా నియోజకవర్గ ముఖ్య నేత పార్టీ మారితే.. ఆయన వెంట ఎంతో కొంత క్యాడర్ పోతుంది.. కానీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారినా చరిత్రలో మొదటిసారి క్యాడర్ ఎవరూ బీఆర్ఎస్ను వీడలేదు. మీకు నిజంగా హ్యాట్సాఫ్.. బీఆర్ఎస్ పార్టీపై మీకు నిజమైన నిబద్ధత ఉన్నది’ అంటూ నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ రంగినేని అభిలాష్రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మర్రి మీడియాతో మాట్లాడుతూ.. గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ నాయకులంతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. గువ్వల పార్టీ మారి తన రాజకీయ జీవితాన్ని బొందపెట్టుకున్నారని చెప్పారు. శుక్రవారం జరిగే సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. 15 రోజుల్లో అచ్చంపేటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వచ్చి పార్టీ శ్రేణులతో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.