హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): చిరు ధాన్యాల సాగు పెంచాలని, వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రోపికల్ అగ్రికల్చర్ (సీఐఏటీ) అధిపతి ప్రొఫెసర్ గంగిరెడ్డి అన్నారు. నిత్యజీవితంలో మిల్లెట్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం గచ్చిబౌలిలోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మిల్లెట్స్ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు మిల్లెట్స్ వంటకాలను ఉద్యోగులకు వడ్డించారు. కార్యక్రమంలో పీటీఆర్ఐ డీజీ వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.