హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వానకాలం సాగు, ఎరువుల లభ్యతపై గురువారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి 15.6 లక్షల ఎకరాల్లో, కంది 76 వేల ఎకరాల్లో సాగైనట్టు చెప్పారు. జూలై, ఆగస్టు నెలల ఎరువుల కోటాను ముందుగానే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్టు తెలిపారు. ఈ సీజన్‌కు 10.4 లక్షల టన్నుల యూరియా, 2.4 లక్షల టన్నుల డీఏపీ, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులను కేంద్రం కేటాయించిందని చెప్పారు. జూలై చివరి నాటికి 5.65 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 8.35 లక్షల టన్నులు, 1.57 లక్షల టన్నుల డీఏపీ అవసరం కాగా 1.47 లక్షల మెట్రిక్ టన్నులను ఉంచినట్టు తెలిపారు. 1.3 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులకు గాను 5.37 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. ఈ-పాస్ ద్వారానే ఎరువుల అమ్మకాలు జరిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు.