హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధంచేసింది. వచ్చే సీజన్లో ఏకంగా 1.62 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పత్తి సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలను కూడా రెడీ చేసింది. 1.62 కోట్ల ఎకరాలకు 15.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేయగా.. అంతకు మించి 18.54 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే కాళేశ్వరం నీళ్లతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడం.. ఈ ఏడాది వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణలో మళ్లీ సిరుల పంట పండటం ఖాయమని భావిస్తున్నారు.
పత్తి పెరిగింది.. వరి తగ్గింది
మార్కెట్ డిమాండ్ మేరకు పంటల సాగు విస్తీర్ణంలో అధికారులు మార్పులు చేశారు. గత వానకాలం మాదిరి ఈసారి కూడా పత్తి, కంది పంటలను భారీగా సాగు చేయాలని.. వరి సాగు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు ప్రణాళిక రూపొందించారు. గత సీజన్లో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అంటే ఈ ఏడాది దాదాపు 20 లక్షల ఎకరాలు పెంచడం గమనార్హం. వరి గతంలో 53.33 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి 48.67 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. మార్కెట్లో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోవడం కూడా వరి సాగు తగ్గించేందుకు కారణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత 25 లక్షల ఎకరాల్లో కంది సాగు చేసేలా నిర్ణయించారు. గతేడాది కంది 10.84 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే గతంతో పోల్చితే 13 లక్షల ఎకరాలు కంది విస్తీర్ణం పెంచడం విశేషం. ఈ వానకాలంలో పత్తి, కంది సాగును భారీగా పెంచాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించిన విషయం తెలిసిందే.
విత్తనం సిద్ధం
సాగు ప్రణాళికకు తగ్గట్టు అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. 75 వేల క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 14.50 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, లక్ష క్వింటాళ్ల కంది విత్తనాలను అందుబాటులో ఉన్నాయి. ఇందులో 55 లక్షల క్వింటాళ్లు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఉండగా, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వద్ద 3,226 క్వింటాళ్లు, ప్రైవేటు కంపెనీల వద్ద 11.66 లక్షల క్వింటాళ్లు, రైతుల వద్ద లక్ష క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
విత్తన కొరత లేకుండా చర్యలు
వానకాలంలో రైతులకు విత్తన కొరత లేకుండా ముందే అవసరానికి మించి విత్తనాలను రెడీగా ఉంచాం. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పత్తి, కంది పంటను అధికంగా సాగుచేసేలా ప్రణాళిక రూపొందించాం. గతేడాది మాదిరిగానే ఈసారి భారీ విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది.