హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గురువారం గూగుల్‌తో మూడేండ్లపాటు కొనసాగే కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్టు సీఎస్బీ డైరెక్టర్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ కుదుర్చుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో గూగుల్ తన క్లౌడ్ ఆధారిత సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్వోసీ)ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం అమలు చేయనున్నదని ఆమె వివరించారు. ఈ సేవలను గూగుల్ క్లౌడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన ఇలోయిస్ డిజిటల్ ద్వారా సీఎస్‌బీకి ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
ఈ సేవల ద్వారా మెరుగ్గా సైబర్ నేరాలను నివారించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలకు నిరంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్బీ ఎస్పీ హర్షవర్దన్, ఇలోయిస్ డిజిటల్ డైరెక్టర్ ముత్తుస్వామి ధరణిధరన్, ఆరేట్ ఐఆర్ ఎల్ఎల్పీ సీనియర్, వైస్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ పేశర్, గూగుల్ సెక్యూరిటీ బిజినెస్ హెడ్ జ్యోతి ప్రకాశ్, సెంటినెల్ వన్ ఇండియా స్టాఫ్ సొల్యూషన్స్ ఇంజినీర్ శశిధర్ వెల్లంచేటి తదితరులు పాల్గొన్నారు.