హైదరాబాద్ : నూతనంగా నియామకమైన ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త కలెక్టర్లకు ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించిన సీఎస్ సోమేశ్ కుమార్.. పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ధరణి పోర్టల్‌ను రూపొందించడం జరిగిందని తెలిపారు.భూసమస్యల పరిష్కారానికి అద్భుత పోర్టల్ ధరణి సీఎస్ పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రం ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ధరణి పోర్టల్ ప్రారంభమైన ఏడాదిలోనే 8 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయని తెలిపారు. ధరణి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ఆధారంగా మాత్రమే పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. కలెక్టర్లు ధరణి వ్యవస్థను సక్రమంగా అమలు చేయాలి. పెండింగ్‌లోని ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా పనిచేసే విధంగా ధరణి మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ధరణి గ్రీవేన్స్ను పరిష్కరించడంపై ఉదాహరణలతో జిల్లా కలెక్టర్లకు సీఎస్ వివరించారు.