హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): సులభతర వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి ఈ ఏడాది టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను కోరారు.శుక్రవారం సచివాలయంలో ఈవోడీబీ పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన పలు సంసరణలపై సీఎస్ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
జూలై నెలాఖరులోగా ఈవోడీబీ కింద చేపట్టాల్సిన అన్ని సంసరణలను పూర్తి చేయాలని శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ఏడాది చేపట్టాల్సిన సంసరణల గురించి శాఖలకు అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, అగ్ని మాపక శాఖ డీజీ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రవాణాశాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి, సీడీఎంఏ దివ్య, పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.